Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోడి పందేనికైతే డేగే... రోజూ ఏం తింటుందో తెలుసా?

  • సిద్ధమవుతున్న సంక్రాంతి బరులు
  • ఒక్కో కోడిపై రూ. 20 వేల వరకూ ఖర్చు
  • రూ, లక్ష వరకూ అమ్ముతున్న పెంపకందారులు
సంక్రాంతి సందడి మొదలైంది. పలు ప్రాంతాల్లో కోడి పందాలు సిద్ధమవుతున్నాయి. గ్రామాల్లో గత మూడు నాలుగు నెలలుగా పందెపు పుంజులను పందెం రాయుళ్లు, బరుల నిర్వాహకులు రెడీ చేస్తున్నారు. మరో పదిరోజుల్లో జరిగే పందేల కోసం ఇప్పుడు పంజులకు భారీగా గిరాకీ ఏర్పడింది. పందేల కోసం సిద్ధమవుతున్న కోళ్లలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, డేగకు మాత్రం చాలా డిమాండ్ కనిపిస్తోంది.

సాధారణంగా నెమలి, కొక్కిరాయి, డేగ, రసంగి, పర్ల, పచ్చకాకి, తీతువా, గౌడ నెమలి, సేతువ, మైలా, పింగళ, కాకి, నల్లబొట్ల తీతువా,అబ్రాస్‌ వంటి రకాలకు డిమాండ్ ఉంటుంది. వీటిల్లో డేగ రకంపై అటు పందెం రాయుళ్లు, ఇటు నిర్వాహకులు ఆశలు పెంచుకుంటున్నారు. డేగ వెరైటీ కోళ్లను పెంచే విధానమే వైవిధ్యంగా ఉంటుంది. ఇవి చాలా బలంగా, చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.

పొద్దున్నే 6 గంటలకే వీటి దినచర్య ప్రారంభం అవుతుంది. తెల్లారగానే వీటిని నీళ్లల్లో ఈత కొట్టిస్తూ వ్యాయామం చేయిస్తారు. ఆపై 7 గంటల నుంచి ఒక్కో పుంజుకు 10 బాదం పప్పులు, నల్లద్రాక్ష, తాటి బెల్లం, ఎండు ఖర్జూరం, నల్లనువ్వులు కలిపి తయారు చేసిన నువ్వుల ఉండలను ప్రతి గంటకు ఒకటి చొప్పున తినిపిస్తారు. ఆపై మధ్యాహ్నం 50 గ్రాముల మటన్, జీడిపప్పు కలిపిన ఆహారాన్ని వీటికి పెడతారు. సాయంత్రం పూట సోళ్లు, సజ్జలు, వడ్లతో పాటు గుడ్డును ఆహారంగా అందిస్తారు.

మరికొన్ని ఎంపిక చేసుకున్న డేగలకు కొందరు వైన్‌ ను తాగిస్తుంటారు. ఇంకొంతమంది వాటి కండలను పెంచేందుకు, తిన్నది అరిగేందుకు లీవ్‌ 52 సిరప్, న్యూరోబియాన్ టాబ్లెట్లను కూడా ఇస్తుంటారు. ఇందుకోసం ఒక్కో పుంజుకు రోజుకు రూ. 200 వరకూ ఖర్చు అవుతుంది. అంటే, మొత్తం మీద మూడు నెలల వ్యవధిలో దాదాపు 18 నుంచి 20 వేల వరకూ కోళ్ల పెంపకంపై ఖర్చు చేసే పెంపకందారులు, వాటిని రూ. లక్ష వరకూ అమ్ముతుంటారు.
Dega
Cock
Sankranti
East Godavari District
West Godavari District

More Telugu News